శ్రీవారి భక్తులకు పదిరోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం : టీటీడీ

శ్రీవారి భక్తులకు పదిరోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం : టీటీడీ

శ్రీవారి భక్తులకు పదిరోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం : టీటీడీ

తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు శుభవార్త చెప్పింది. శ్రీవారి ఆలయంలో పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు తెలిపింది. ఈ నెల 23 నుంచి 2024 జనవరి ఒకటో తేదీ వరకు వైంకుఠ ద్వారాన్ని తెరిచి భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. 

తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 23 నుండి 2024 జనవరి 1వ తేదీ వ‌ర‌కు వైకుంఠ ద్వార దర్శనాన్ని పురస్కరించుకుని డిసెంబరు 19వ తేదీన మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ సంద‌ర్భంగా డిసెంబరు 19న బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ కారణంగా డిసెంబరు 18న సోమవారం సిఫారసు లేఖలు స్వీకరించరని టీటీడీ ప్రకటించింది. జనవరి 14వతేది వరకు శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ రద్దు చేసారు. నెల రోజులు పాటు సుప్రభాతంకు బదులుగా తిరుప్పావైతో స్వామివారికి మేల్కోలుపు నిర్వహిస్తారు. ఇక, వైకుంఠ ఏకాదశికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

వైకుంఠ ద్వార దర్శనం పది రోజుల్లో ఏ రోజు దర్శనం చేసుకున్నా అన్ని రోజులూ సమానమేనని టీటీడీ పేర్కొంది. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి దర్శనానికి రావాలని కోరింది. తిరుమ‌ల‌లో గ‌దులు ప‌రిమితంగా ఉన్న కార‌ణంగా ఈ ప‌ర్వదినాల్లో భ‌క్తుల ర‌ద్దీ దృష్ట్యా తిరుప‌తిలో గ‌దులు పొందాల్సిందిగా భ‌క్తులకు విజ్ఞప్తి చేసింది. గ‌తంలో మాదిరిగానే ఈ ఏడాది స్వయంగా వ‌చ్చే ప్రోటోకాల్ వీఐపీలకు ప‌రిమితంగా మాత్రమే బ్రేక్ దర్శనం ఇస్తుందన్నారు. సిఫార‌సు లేఖ‌లు స్వీకరించమని స్పష్టం చేసింది. వీఐపీలు, ఇత‌ర భ‌క్తులు తొలిరోజైన వైకుంఠ ఏకాద‌శి రోజు మాత్రమే దర్శనం చేసుకోవాల‌నే తొంద‌ర‌పాటు లేకుండా ప‌ది రోజుల్లో ఏదో ఒక‌రోజు దర్శనం చేసుకునేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించింది.  టోకేన్ లేని భక్తులు తిరుమలకు విచ్చేసినా వారికి వసతి, దర్శన సౌకర్యం లభించదని.. 23వ తేది ఉదయం 9 గంటలకు స్వర్ణరథం ఉరేగింపు నిర్వహిస్తామని టీటీడీ ప్రకటించింది. 

ఈ నెల 23వ తేది నుంచి శ్రీవారి ఆలయంలో పది రోజులు పాటు వైకుంఠ ద్వార దర్శనం నిర్వహించనున్నారు. 22వ తేదిన తిరుపతిలో ఆఫ్ లైన్ విధానంలో సర్వదర్శనం భక్తులుకు టోకేన్లు జారి చేయనున్నారు. .పది రోజులుకు 4.25 లక్షల టోకేన్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఇప్పటికే ఆన్ లైన్ టికెట్ల విక్రయాలు పూర్తయ్యాయి. ఈ నెల 19న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా.. వీఐపి బ్రేక్ దర్శనాలు,అష్టదళపాదపద్మారాదన సేవలను టీటీడీ రద్దు చేసింది.  

వైకుంఠ ద్వార దర్శనం విశిష్టత..

వైకుంఠంలో శ్రీ‌మ‌హావిష్ణువుకు ఒక రోజు అంటే భూలోకంలో ఒక సంవత్సరం అని అర్థం. అదేవిధంగా అక్కడ ప‌గ‌లు 12గంట‌లు ఇక్కడ 6 నెల‌లు ఉత్తరాయ‌ణం, రాత్రి 12 గంట‌లు ఇక్కడ ఆరు నెలలు దక్షిణాయణం. వైకుంఠంలో తెల్లవారుజామున 120 నిమిషాలు భూలోకంలో 30 రోజులతో సమానం. దీన్ని ధ‌నుర్మాసంగా పిలుస్తున్నాం. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో 40 నిమిషాలు శ్రీ‌మ‌హావిష్ణువు దేవ‌త‌ల‌కు, ఋషుల‌కు ద‌ర్శన‌మిస్తారు. ఇది వైకుంఠంలో ఆ కాలమానం ప్రకారం ప్రతిరోజు జరిగే ప్రక్రియ. భూలోకం కాలమానం ప్రకారం సంవత్సరంలో ఒకసారి జరిగే ప్రక్రియగా కనిపిస్తుంది. ఈ 40 నిమిషాలు భూలోకంలో 10 రోజులకు స‌మానం కాబ‌ట్టి వైష్ణవాల‌యాల్లో పది రోజుల్లో వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే శ్రీ‌మ‌హావిష్ణువును ప్రత్యక్షంగా ద‌ర్శనం చేసుకున్న భాగ్యం క‌లుగుతుంది భక్తుల విశ్వాసం.