లోక్ సభ ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చిన కేటీఆర్

లోక్ సభ ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చిన కేటీఆర్

లోక్ సభ ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చిన కేటీఆర్

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఏమాత్రం కుంగిపోవద్దని... ఓడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థులే నియోజకవర్గ ఇంఛార్జులని... తమ తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ కేడర్‌కు సూచించారు. సోమవారం ఆయన చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గం నేతలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఎంపీ రంజిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... లోక్ సభ ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా సమావేశాలు నిర్వహించుకోవాలని, పార్టీని బలోపేతం చేయాలన్నారు. జనవరి 26వ తేదీలోగా సమావేశాలు పూర్తి చేసుకోవాలన్నారు.

సమావేశం అనంతరం ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ... తనను చేవెళ్ల ఎంపీగా పోటీ చేయమని కేటీఆర్ చెప్పారని, గెలుపే లక్ష్యంగా పని చేయాలని దిశానిర్దేశనం చేశారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినందున ఇక బీఆర్ఎస్ ఖాళీ అవుతోందని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని, దీనిని తిప్పికొట్టాలని సూచించినట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిన స్థానాలపై ఈ లోక్ సభ ఎన్నికల్లో ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.

 కాంగ్రెస్ అంటేనే మోసం, కుట్ర, మభ్యపెట్టడం: ఎమ్మెల్సీ కవిత

కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, కుట్ర అని.. ప్రజలను మభ్యపెట్టడంలో ఆ పార్టీ ముందు ఉంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఆ పార్టీ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేక ధోరణి ఉందని విమర్శించారు. ఈమేరకు ఎమ్మెల్సీ కవిత సోమవారం తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ.. హిందీ మాట్లాడే రాష్ట్రాలను గోమూత్ర రాష్ట్రాలని డీఎంకే నేత హేళన చేసినపుడు రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు.

ఇండియా కూటమిలో డీఎంకే కూడా ఉందని గుర్తుచేసిన కవిత.. కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ విషయంపై మౌనాన్ని ఆశ్రయించడాన్ని ప్రశ్నించారు. దేశాన్ని ఐక్యం చేయడానికి భారత్ జోడో యాత్ర చేశానని చెప్పుకుంటున్న రాహుల్ గాంధీ.. తమ మిత్రపక్షం నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై పట్టనట్టు ఉంటున్నారని కవిత విమర్శించారు.

కర్ణాటకలో కొనసాగుతున్న హిజాబ్ వివాదంపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని రాహుల్ గాంధీ వెల్లడించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏవేవో హామీలు ఇస్తుందని, కానీ ఎన్నికల తర్వాత వాటిని విస్మరిస్తుందని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలుపై కవిత స్పందిస్తూ.. తెలంగాణ ప్రభుత్వానికి మరికొంత సమయం ఇస్తామని ఆమె చెప్పారు. ఆలోగా అమలు చేయకపోతే ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వంతో పోరాడుతామని తెలిపారు.

పేద విద్యార్థినికి ఆర్థిక సాయం చేసిన కేటీఆర్

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఓ పేద విద్యార్థినికి చేయూతనందించారు. ఖమ్మం జిల్లా ఇల్లెందు పట్టణానికి చెందిన అన్నపూర్ణ ఓ పేద మహిళ. కుమార్తెను చదివించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్, కేటీఆర్ ను కలవడానికి ఆమె హైదరాబాద్ వచ్చారు. 

అన్నపూర్ణ పరిస్థితి గురించి తెలుసుకున్న కేటీఆర్ చలించిపోయారు. ఆమె కుమార్తెకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. అప్పటికప్పుడు అన్నపూర్ణకు సొంతంగా రూ.1 లక్ష అందించారు. కుమార్తెను బాగా చదివించాలని సూచించారు. కేటీఆర్ నుంచి ఆర్థికసాయం అందుకున్న అన్నపూర్ణ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. 

దీనికి సంబంధించిన వీడియోను బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది. అన్నపూర్ణను ప్రజాదర్బార్ పొమ్మంటే బీఆర్ఎస్ పార్టీ ఆదుకుందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారం రోజుల పాటు హడావిడి చేసిన ప్రజాదర్బార్ కేవలం ప్రచారానికే పరిమితమైనట్టు కనిపిస్తోందని బీఆర్ఎస్ విమర్శించింది.