భారత్‌ను ప్రశంసించిన పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్

భారత్‌ను ప్రశంసించిన పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్

భారత్‌ను ప్రశంసించిన పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత్‌పై మరోమారు ప్రశంసలు కురిపించారు. పాక్ చుట్టూ ఉన్నా దేశాలు చంద్రుడిని అందుకుంటుంటే మనం మాత్రం ఇంకా ఆపసోపాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని ఇస్లామాబాద్‌లో తన పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) కేడర్‌తో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక దుస్థితి గురించి మాట్లాడుతూ దీనికి కారణం దేశమేనని పేర్కొన్నారు. ‘‘మన పొరుగువారు చంద్రుడిని చేరుకున్నారు. మనం ఈ భూమ్మీదే ఎదగలేకపోతున్నాం. ఇది ఇలాగే కొనసాగదు’’ అని చెప్పుకొచ్చారు. మన పతనానికి మనమే కారణమని, లేదంటే ఈ దేశం ఈ పాటికి ఎక్కడో ఉండేదని పేర్కొన్నారు.

2013లో దేశం తీవ్ర విద్యుత్తు సంక్షోభాన్ని ఎదుర్కొంటే మనమొచ్చి దానిని పరిష్కరించామని, దేశంలో ఉగ్రవాదాన్ని రూపుమాపి కరాచీలో శాంతి నెలకొల్పామని, రహదారులు నిర్మించామని, చైనా- పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ) వచ్చిందని, అభివృద్ధిలో నూతనశకం ప్రారంభమైందని చెప్పుకొచ్చారు. దేశంలో నెలకొన్న సంక్షోభాలకు ఎవరిని నిందించాలని, మన కాళ్లను మనమే నరుక్కున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రభుత్వ హయాంలో దేశంలో ఆబ్‌పరా, ఇస్లామాబాద్‌లో 2 పాకిస్థానీ రూపాయలకే రొట్టె లభించేదని, కానీ ఇప్పుడది 30 రూపాయలకు చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, 1993, 1999, 2017లో దేశానికి ప్రధానిగా పనిచేసిన నవాజ్ షరీఫ్ నాలుగోసారి ప్రధాని పదవికి ప్రయత్నిస్తున్నారు.