ఢిల్లీ చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీ చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీ చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. కాసేపటి క్రితమే ఆయన ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ల్యాండయ్యారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెండోసారి ఢిల్లీకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను సీఎం రేవంత్ కలుసుకోనున్నారు. పార్టీలోని ఇతర సీనియర్ నేతలతోనూ రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం.

ఈ భేటీలో ప్రధానంగా తెలంగాణ క్యాబినెట్ విస్తరణపైనే చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. సోమవారం హైదరాబాద్ లో జరిగిన పీఏసీ సమావేశంలోనూ ఇదే అంశంపై చర్చ జరిగిందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ చర్చల సారాంశాన్ని పార్టీ హైకమాండ్ కు నివేదించి, క్యాబినెట్ లోకి ఎవరెవరిని తీసుకోవాలనే విషయంపై రేవంత్ రెడ్డి సూచనలు స్వీకరిస్తారు. తెలంగాణ కేబినెట్ లో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సహా మొత్తం 12 మంది ఉన్నారు. మరో ఆరుగురికి అవకాశం ఉండగా.. ఆశావహుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఉమ్మడి పది జిల్లాల్లో నాలుగు జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉంది. ఈ విషయంపై అధిష్ఠానంతో రేవంత్ చర్చించనున్నారు.

ఢిల్లీలో రేవంత్‌రెడ్డి కోసం అధికారిక నివాసం రెడీ.. కేసీఆర్

 నేమ్‌ప్లేట్ తొలగింపు

ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అధికార నివాసాన్ని సందర్శించారు. ఈ భవనం తుగ్లక్ రోడ్ లో ఉంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు 20 ఏళ్ల పాటు ఈ అధికార నివాసంలో ఉన్నారు. సీఎం పదవిని కోల్పోయిన కేసీఆర్ అధికార నివాసాన్ని ఖాళీ చేశారు. సీఎంగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఆయన తొలిసారి ఈ నివాసానికి వచ్చారు. అంతకు ముందు ఢిల్లీలో అడుగుపెట్టిన వెంటనే రేవంత్ తొలుత ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ లో పీఏసీలో చర్చించిన అంశాల గురించి ఆయనకు వివరించారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోసం దేశరాజధాని ఢిల్లీలో అధికారిక నివాసం సిద్ధమైంది. తుగ్లక్ రోడ్ 23లోని అధికారిక నివాసానికి చిన్నచిన్న మరమ్మతులు చేసి పూర్తిగా సిద్ధం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతో ఉన్న నేమ్‌ప్లేట్‌ను తొలగించి దాని స్థానంలో తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో రేవంత్‌రెడ్డి పేరుతో నేమ్‌ప్లేట్ ఏర్పాటు చేశారు.

రేవంత్‌కు కేటాయించిన ఈ ఇంట్లో కేసీఆర్ దాదాపు 20 సంవత్సరాలపాటు ఉన్నారు. 2004లో కేంద్రమంత్రి హోదాలో కేసీఆర్ ఈ ఇంటికి మారారు. ఆ తర్వాత ఉద్యమ నేత, సీఎంగా ఈ ఇంటిని కొనసాగించారు. ఇప్పుడు అధికారం కోల్పోవడంతో ఖాళీ చేయక తప్పలేదు. కేసీఆర్‌కు సంబంధించిన వస్తువులను ఆ ఇంటి నుంచి ఇటీవలే అధికారులు తరలించారు.