ఐపీఎల్ వేలంలో రికార్డు ధరకు రాబిన్ మింజ్‌ను దక్కించుకున్న గుజరాత్ టైటాన్స్

ఐపీఎల్ వేలంలో రికార్డు ధరకు రాబిన్ మింజ్‌ను దక్కించుకున్న గుజరాత్ టైటాన్స్

ఐపీఎల్ వేలంలో రికార్డు ధరకు రాబిన్ మింజ్‌ను దక్కించుకున్న గుజరాత్ టైటాన్స్

దుబాయ్‌ వేదికగా మంగళవారం ముగిసిన ఐపీఎల్ 2024 వేలంలో సంచలనాలు నమోదయ్యాయి. ఫ్రాంచైజీలు కోట్ల రూపాయలు కుమ్మరించి ఆటగాళ్లను దక్కించుకున్నాయి. తక్కువ బేస్ ధరతో అందుబాటులో ఉన్న పలువురు ఆటగాళ్లను ఫ్రాంచైజీలు భారీ మొత్తంలో వెచ్చించి కొనుగోలు చేశాయి. కేవలం రూ.20 లక్షల బేస్ ధరతో ఉన్న ఓ కుర్రాడిని గుజరాత్ టైటాన్స్ ఏకంగా రూ.3.6 కోట్లు పెట్టి కొనుగోలు చేయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. వేలంలో అందరి దృష్టిని ఆకర్షించి రికార్డు స్థాయి ధరకు అమ్ముడుపోయిన 21 ఏళ్ల ఈ కుర్రాడి పేరు రాబిన్ మింజ్. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి వీరాభిమాని అయిన రాబిన్ మింజ్ ఝార్ఖండ్‌కు చెందిన గిరిజన యువకుడు. 

ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ అయిన రాబిన్ మింజ్ భారీ షాట్లు కొట్టగల సమర్థవంతుడు. అనుభవజ్ఞుడైన కోచ్ చంచల్ భట్టాచార్య మార్గనిర్దేశంలో మెలకువలు నేర్చుకుని క్రికెట్ ఆడుతుండడంతో వేలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. రాబిన్ మించ్ ‘ఎడమచేతి వాటం పోలార్డ్’ అని టీమిండియా మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్ప వ్యాఖ్యానించాడంటే అతడు ఏవిధంగా షాట్లు కొడతాడో ఊహించుకోవచ్చు. ఈ కారణంగానే గుజరాత్ టైటాన్స్ చాలాకాలం నుంచే అతడి ఆటను గమనించింది. అతడిని దక్కించుకునేందుకు వేర్వేరు ఫ్రాంచైజీలు గట్టిగానే ప్రయత్నించాయి. చివరకు భారీ ధర వెచ్చించి గుజరాత్ టైటాన్స్‌ దక్కించుకుంది. రాబిన్ ఝార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాకు చెందినవాడు. అయితే యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ముంబై ఇండియన్స్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ తీసుకునే సమయంలో అతడి ప్రతిభ వెలుగులోకి వచ్చింది.

మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఐపీఎల్ 2023 వేలంలో మింజ్‌ను ఎవరూ కొనుగోలు చేయలేదు. అన్‌సోల్డ్ ప్లేయర్‌గా మిగిలిపోయాడు. ఇప్పుడు ఏకంగా దేశం దృష్టిని ఆకర్షించే ధరకు అమ్ముడుపోయాడు. కాగా వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో మింజ్ అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి. తుది జట్టులో స్థానం కోసం వృద్ధిమాన్ సాహాతో పోటీ నెలకొనే అవకాశాలున్నాయని క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని నమ్‌కుమ్ ప్రాంతంలో అతడు నివాసం ఉంటున్నాడు. ఝార్ఖండ్ అండర్ 19, అండర్ 25 జట్లలో ఆడాడు. కానీ ఇంతవరకు రంజీ ట్రోఫీలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించకపోవడం గమనార్హం. కాగా రాబిన్ మింజ్ తండ్రి ఆర్మీలో పనిచేసి రిటైరయ్యారు. ప్రస్తుతం రాంచీలోని బిర్సా ముండా విమానాశ్రయంలో గార్డుగా ఆయన పనిచేస్తున్నారు. మింజ్‌కు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు.