వీఆర్‌ఏలకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్.. త్వరలోనే ఉత్తర్వులు!

వీఆర్‌ఏలకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్.. త్వరలోనే ఉత్తర్వులు!

వీఆర్‌ఏలకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్.. త్వరలోనే ఉత్తర్వులు!

ఏపీలో వీఆర్‌ఏలకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. నెలకు రూ.300 చొప్పున డీఏను కొనసాగించే ప్రతిపాదనలపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ట్రెజరీ డిపార్టుమెంట్‌ డైరెక్టర్‌ మెమో జారీచేసినప్పటికీ అదనంగా డీఏ డ్రా చేసిన వీఆర్‌ఏల నుంచి రికవరీ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో నెలకు డీఏ కింద రూ.300 చెల్లింపును కేవలం 5 నెలలకు మాత్రమే పరిమితం చేస్తూ 2019 జనవరిలో జీవో ఇచ్చారని తెలిపారు.

ఈ వ్యవధిని మించి అదనంగా వీఆర్‌ఏలకు జరిగిన చెల్లింపుల సమాచారాన్ని సేకరించాలని ట్రెజరీ అండ్‌ అకౌంట్స్‌ అధికారులు జిల్లాలకు మెమో జారీచేసినా రికవరీ మాత్రం జరగలేదన్నారు. ఉద్యోగ సంఘాలు డీఏ పునరుద్ధరించాలని కోరుతున్నారని.. అందుకే ప్రతిపాదనలు తయారయ్యాయన్నారు. త్వరలోనే దీనిపై నిర్ణయం వెలువడే అవకాశం ఉందంటున్నారు.



ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే సుమారు 3,795 మంది వీఆర్ఏలకు వీఆర్వోలుగా పదోన్నతి కల్పించామని తెలిపారు. ఈ ప్రభుత్వ హయాంలో జరిగిన GSWS ఉద్యోగ నియామకాలలో కూడా అర్హత కలిగిన సుమారు 2,880 మంది నామినీ వీఏవోలను, వీఆర్ఏ లను కూడా గ్రేడ్-2 వీఆర్వోలుగా నియమించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇటీవల అర్హత కలిగిన 66 మంది వీఆర్ఏలను గ్రేడ్ -2 లుగా పదోన్నతి కల్పించామన్నారు. ఈ ప్రభుత్వం వీఆర్ఏలకు సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.

రాష్ట్రంలో దాదాపు 19,359 మంది వీఆర్ఏలు సేవలు అందిస్తున్నారని.. ట్రెజరీ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ వారు మెమో ఇచ్చినప్పటికీ ఏ ఒక్క వీఆర్ఏ నుంచి కూడా అదనంగా డ్రా చేసిన డీఏను రికవరీ చేయలేదన్నారు. రెవెన్యూ విభాగం వీఆర్ఏల నుంచి డీఏకు సంబంధించి ఎటువంటి రికవరీ లేకుండా చేయడంతో పాటుగా.. ప్రతి వీఆర్ఏకు నెలకు రూ .300/- చొప్పున డీఏ కొనసాగించేలా తగిన ప్రతిపాదనలను తయారు చేశారన్నారు. ఈ ప్రతిపాదనలపై అతి త్వరలో నిర్ణయం వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.


మరోవైపు ఇటీవల గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ప్రతినిధులు సీఎం జగన్‌ను కలిశారు. రాష్ట్రంలో అర్హత కలిగిన వీఆర్వోలకు పదోన్నతులు కల్పించాలని కోరారు.. వీఆర్వోల పదోన్నతుల్లో 40 శాతం రేషియో అమల్లో ఉందని.. అందుకే చాలా మంది వీఆర్వోలకు సీనియర్‌ సహాయకుల పోస్టులు రావడం లేదని ముఖ్యమంత్రికి వివరించారు. ఈ పదోన్నతుల్లో 70 శాతం రేషియో ఇవ్వాలని కోరారు.. అలాగే విధి నిర్వహణలో ఎవరైనా వీఆర్వో చనిపోతే వారి కుటుంబసభ్యులకు కారుణ్య నియామకాలు ద్వారా ఉద్యోగం ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. అర్హత కలిగిన వీఆర్‌ఏలకు అర్హత పరీక్ష నిర్వహించి వీఆర్వోలుగా పదోన్నతి ఇవ్వాలని కోరారు. తమ వినతులపై సీఎం సానుకూలంగా స్పందించారని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.