పాకిస్తాన్: బజౌర్ జిల్లాలో భారీ పేలుడు, 35మంది మృతి
పాకిస్తాన్: బజౌర్ జిల్లాలో భారీ పేలుడు, 35మంది మృతి

పాకిస్తాన్‌లోని బజౌర్ జిల్లాలోని ఖార్ తహసిల్ ప్రాంతంలో జరిగిన భారీ పేలుడులో కనీసం 35 మంది మరణించారు, 200మంది గాయపడ్డారు.
ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం (ఫజల్) పార్టీ నిర్వహించిన కార్యకర్తల సదస్సులో పేలుడు సంభవించింది.
క్షతగాత్రులను ఆసుపత్రులకు చేర్చే పనిలో రెస్క్యూ సిబ్బంది శ్రమిస్తున్నారు. ఇప్పటి వరకు 35 మందిని ఆసుపత్రికి తరలించారు.
గాయపడినవారు పెద్ద సంఖ్యలో ఉండటంతో వారిని ఆస్పత్రికి తరలించడం కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా ఆస్పత్రిలో అధికారులు ‘హెల్త్ ఎమర్జెన్సీ’ ప్రకటించారు.
ఈ పేలుడుకు కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటన జరిగిన వెంటనే భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.
తమ పార్టీ సమావేశంలో జరిగిన ఈ పేలుడును జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం (ఫజల్) ప్రధాన కార్యదర్శి మౌలానా అబ్దుల్ గఫూర్ హైదరీ తీవ్రంగా ఖండించారు. కొందరు దేశంలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టే కుట్రతో ఈ పని చేసి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.